తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ రైతు బాట పట్టను న్నారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు నవంబర్ 2 నుంచి ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేయను న్నారు. ప్రతిరోజు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యక్రమం రూపొంది స్తున్నారు. సీనియర్ నేత కోడెల ఆధ్వర్యంలో పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామాల్లోని రైతులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను బాబు తెలుసుకుంటారు. స్థానికంగా ఉండే మార్కెట్ యార్డులను కూడా పరిశీలించనున్నారు. వాటిపై ఆయన రైతుల సమక్షంలోనే ఆయా జిల్లా కలెక్టర్లకు ఫోన్లు చేసి, వాకబు చేయనున్నారు.
నవంబర్ 2 నుంచి అనంతపురం నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు ‘రైతు రాజ్యం కోసం’ లేదా ‘రైతుపోరుబాట’ గానీ పేరు ఖరారు చేయనున్నారు. చివరకు ‘రైతు రాజ్యం కోసం’ పేరును ఖరారు చేయవచ్చంటున్నారు. ఈ మేరకు రాష్టవ్య్రాప్తంగా బాబు పాదయాత్ర కార్యక్రమాన్ని రైతు కమిటీ చైర్మన్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్టీ నేతలతో కలసి రూపొందించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లా పాదయాత్ర అనంతరం రెండురోజుల గడువు తర్వాత ప్రకాశం, గుంటూరు, కృష్ణా.. ఆ తర్వాత మొత్తం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు.
గతంలో ‘రైతుకోసం’ ఆమరణ నిరాహారదీక్షతో రైతుల మనసు గెలిచిన బాబు.. ఈసారి ఏకబిగిన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సన్నాహాలు చేస్తుండటం చర్చనీయాంశమయింది. ఇటీవలి కాలంలో రాష్టవ్య్రాప్తంగా పాదయాత్రలు చేసిన నాయకులు లేకపోవడం గమనార్హం. తనపై గతంలో వైఎస్ వ్యూహబృందం వేసిన రైతు వ్యతిరేకి ముద్రను ఆమరణ నిరాహారదీక్షతో తొలగించుకున్న బాబు.. ఈసారి పూర్తి స్థాయిలో రైతునేత ముద్ర కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తమను ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్న రైతాంగానికి బాసటగా నిలవడం ద్వారా.. ఎన్టీఆర్ హయాంలో ఉన్న ‘రైతుపార్టీ’ ముద్రను పునరుద్ధరించాలన్నది బాబు ధ్యేయంగా కనిపిస్తోంది. అదే సమయంలో జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహపరచడమే కాకుండా, జిల్లాల్లో నెలకొన్న పార్టీ తగాదాలను పరిష్కరించి, వారిని ఒక్కతాటిపై నడిపించేందుకు ఈ పాదయాత్ర అక్కరకొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాబు యాత్రలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలు ఉండేలా చూస్తున్నారు.