రైతుపోరుబాట పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రలకు రైతాంగం నుంచి స్పందన పెరుగుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. బాబు కోసం రైతులు ఎదురు చూడటమే కాకుండా, ఆయన వెంట ఆసాంతం పాద యాత్రలో పాల్గొనడం పార్టీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురి స్తు న్నాయి. రైతులు పార్టీకి చేరువవుతుండటం శుభపరి ణామమని, రైతాంగం నుంచి వస్తున్న స్పందనను కొనసా గించేందుకు జిల్లా నేతలు కూడా జిల్లా స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉందని చెబుతున్నారు.
రైతు సమస్యలు తెలుసుకునేందుకు పొలం బాట పడు తున్న చంద్రబాబునాయుడు పాద యాత్రలకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో బాబు రైతులకు మరింత చేరువ కావాలంటే ఆయన ఆహార్యం మార్చుకోవలసి ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ‘సూర్య’ పలువురు నేతలు, ద్వితీయ స్థాయి నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భంగా అనేక సూచనలు, సలహాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా.. చంద్రబాబునాయుడు పొలం బాట, పాదయాత్ర సమయంలో పంచెకట్టుతో వెళితే బాగుం టుందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమయింది. సుదీర్ఘకాలం హైటెక్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన చంద్రబాబునాయుడుకు రైతులు దూరమయిన వైనాన్ని విశ్లేషిస్తున్నారు.
తమ హయాంలో విపరీతమైన కరవు కరాళ నృత్యం చేసినప్పటికీ, ఇప్పటికంటే మెరుగ్గానే సాయం అందించామని గుర్తు చేస్తున్నారు. కానీ, ఒక వార్తా పత్రికలో చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారంటూ వెలువడిన వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన వ్యూహ బృందం తమ పార్టీని రైతుల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టడంలో విజయం సాధించిందని వివరించారు. అయితే, ఆ మాట తాను ఎప్పుడు, ఎక్కడ అన్నానో చెప్పాలని బాబు స్వయంగా అసెంబ్లీలో వైఎస్‌ను నిలదీసి నా ఎక్కడా జవాబు రాలేదు. బాబు ఆ మాట ఎప్పుడు అన్నారో నిరూపిస్తే బాబు సహా తామంతా ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ శాశ్వతంగా పోటీ చేయబోమని కోడెల శివప్రసాద్ సవాల్ చేసినా, కాంగ్రెస్ శిబిరం నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో.. కేవలం అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే రైతు వ్యతిరేక ముద్ర వేశారన్న విషయం స్పష్టమయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఆ తర్వాత రైతుకోసం పేరుతో బాబు స్వయంగా ఆమరణ నిరాహారదీక్ష చేయడంతో కాంగ్రెస్ పార్టీ టీడీపీపై వేసిన రైతువ్యతిరేక ముద్ర చెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన రైతాంగం కోసం తన పోరాటాన్ని కొన సాగించడంతో రైతులకు చేరవయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు రైతుపోరుబాట పేరుతో చేస్తున్న పాదయాత్రకూ విశేష స్పందన లభిస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లా మినహా మిగిలిన అనంతపురం, కడప, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చేసిన పాదయాత్ర లకు రైతాంగం నుంచి అనూహ్య స్పందన లభించింది. సరైన నాయకత్వం లేకపోవడం, అగ్రనేతలు ప్రజల్లో తిరగకపోవడంతో ప్రకాశం జిల్లాలో చేపట్టిన కార్యక్రమా లకు ఆశించినంత స్పందన లభించలేదు. అనంతపురం, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రైతాంగం పోటెత్తింది.
అయితే.. రైతు సమస్యల పరిష్కారం కోసం పాద యాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు బూట్లు వేసు కున్నప్పటికీ. ప్యాంటుతో వెళ్లడం కంటే పంచెకట్టుతో వెళితేనే సహజత్వంగా ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ పాదయాత్ర సందర్భంగా బూట్లు, పంచెకట్టును వాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్ చాలా ఏళ్లపాటు సఫారీ వేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ తొలిసారి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేరోజు ముందు వరకూ సఫారీలే వేసుకునేవారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన రోజు వైఎస్ పంచెకట్టడంలో ఇబ్బందిపడు తుంటే ఆయన బాబాయ్ వచ్చి సాయం చేసిన విష యాన్ని ఓ మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పటినుంచీ వైఎస్ పంచె ట్టునే కొనసాగించారు.
నాటి నుంచీ వైఎస్ కట్టిన పంచెకట్టు తె లుగుదనానికి ప్రతీకగా ఉంటుందని, అదేవిధంగా చంద్రబాబుకూడా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమైన పంచెకట్టుతోనే వెళితే సహజత్వంగా ఉంటుందని చెబుతున్నారు. రైతు వినియోగించే కండువా కూడా నిరంతరం వాడాలం టున్నారు. ‘రైతంటే పంచెకట్టాలని రూలేమీ లేదు. ప్యాంటు కూడా వేసుకోవచ్చు. విదేశాల్లో రైతు ప్యాంటే వేసుకుని వ్యవసాయం చేస్తారు. కాకపోతే మన రైతు ఆహార్యం చాలా హుందాగా, పెద్దరికంగా, ఆత్మీయంగా, విశ్వాసానికి, తెలుగుదనానికి ప్రతీకగా ఉంటుంది. బాబు పంచె, కండువాతో వెళితే రైతునేతగా గుర్తుండిపోతారు.
చరణ్‌సింగ్, చౌతాలా వంటి నేతలంతా పంచెతోనే రైతునాయకులిగా గుర్తుండిపోయార’ని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే, చిత్తూరు జిల్లా రైతులు ధరించే తమిళుల తరహాలో అడ్డ లుంగీ కాకుండా, పంచె కడితేనే బాగుంటుందని చెప్పారు. దీనిపై అటు పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ‘మేం దీనిని బాబు దృష్టికి తీసుకువెళతాం. గతంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. అప్పట్లో బాబు దానిపై సుము ఖత వ్యక్తం చేశారు. మళ్లీ దానిపై ఆయనతో మాట్లా డతాం’ అని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు.