Sunday, November 13, 2011

పంచెకట్టి.. పాగా చుట్టి - రైతుపోరుబాట పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రల

babu1
రైతుపోరుబాట పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రలకు రైతాంగం నుంచి స్పందన పెరుగుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. బాబు కోసం రైతులు ఎదురు చూడటమే కాకుండా, ఆయన వెంట ఆసాంతం పాద యాత్రలో పాల్గొనడం పార్టీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురి స్తు న్నాయి. రైతులు పార్టీకి చేరువవుతుండటం శుభపరి ణామమని, రైతాంగం నుంచి వస్తున్న స్పందనను కొనసా గించేందుకు జిల్లా నేతలు కూడా జిల్లా స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉందని చెబుతున్నారు.

రైతు సమస్యలు తెలుసుకునేందుకు పొలం బాట పడు తున్న చంద్రబాబునాయుడు పాద యాత్రలకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో బాబు రైతులకు మరింత చేరువ కావాలంటే ఆయన ఆహార్యం మార్చుకోవలసి ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ‘సూర్య’ పలువురు నేతలు, ద్వితీయ స్థాయి నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భంగా అనేక సూచనలు, సలహాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా.. చంద్రబాబునాయుడు పొలం బాట, పాదయాత్ర సమయంలో పంచెకట్టుతో వెళితే బాగుం టుందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమయింది. సుదీర్ఘకాలం హైటెక్‌ ముఖ్యమంత్రిగా ముద్రపడిన చంద్రబాబునాయుడుకు రైతులు దూరమయిన వైనాన్ని విశ్లేషిస్తున్నారు.


తమ హయాంలో విపరీతమైన కరవు కరాళ నృత్యం చేసినప్పటికీ, ఇప్పటికంటే మెరుగ్గానే సాయం అందించామని గుర్తు చేస్తున్నారు. కానీ, ఒక వార్తా పత్రికలో చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారంటూ వెలువడిన వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన వ్యూహ బృందం తమ పార్టీని రైతుల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టడంలో విజయం సాధించిందని వివరించారు. అయితే, ఆ మాట తాను ఎప్పుడు, ఎక్కడ అన్నానో చెప్పాలని బాబు స్వయంగా అసెంబ్లీలో వైఎస్‌ను నిలదీసి నా ఎక్కడా జవాబు రాలేదు. బాబు ఆ మాట ఎప్పుడు అన్నారో నిరూపిస్తే బాబు సహా తామంతా ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ శాశ్వతంగా పోటీ చేయబోమని కోడెల శివప్రసాద్‌ సవాల్‌ చేసినా, కాంగ్రెస్‌ శిబిరం నుంచి ఎలాంటి జవాబు రాకపోవడంతో.. కేవలం అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌ వ్యూహంలో భాగంగానే రైతు వ్యతిరేక ముద్ర వేశారన్న విషయం స్పష్టమయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఆ తర్వాత రైతుకోసం పేరుతో బాబు స్వయంగా ఆమరణ నిరాహారదీక్ష చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ టీడీపీపై వేసిన రైతువ్యతిరేక ముద్ర చెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన రైతాంగం కోసం తన పోరాటాన్ని కొన సాగించడంతో రైతులకు చేరవయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు రైతుపోరుబాట పేరుతో చేస్తున్న పాదయాత్రకూ విశేష స్పందన లభిస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లా మినహా మిగిలిన అనంతపురం, కడప, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చేసిన పాదయాత్ర లకు రైతాంగం నుంచి అనూహ్య స్పందన లభించింది. సరైన నాయకత్వం లేకపోవడం, అగ్రనేతలు ప్రజల్లో తిరగకపోవడంతో ప్రకాశం జిల్లాలో చేపట్టిన కార్యక్రమా లకు ఆశించినంత స్పందన లభించలేదు. అనంతపురం, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రైతాంగం పోటెత్తింది.

అయితే.. రైతు సమస్యల పరిష్కారం కోసం పాద యాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు బూట్లు వేసు కున్నప్పటికీ. ప్యాంటుతో వెళ్లడం కంటే పంచెకట్టుతో వెళితేనే సహజత్వంగా ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్‌ పాదయాత్ర సందర్భంగా బూట్లు, పంచెకట్టును వాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్‌ చాలా ఏళ్లపాటు సఫారీ వేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ తొలిసారి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేరోజు ముందు వరకూ సఫారీలే వేసుకునేవారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన రోజు వైఎస్‌ పంచెకట్టడంలో ఇబ్బందిపడు తుంటే ఆయన బాబాయ్‌ వచ్చి సాయం చేసిన విష యాన్ని ఓ మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పటినుంచీ వైఎస్‌ పంచె ట్టునే కొనసాగించారు.

నాటి నుంచీ వైఎస్‌ కట్టిన పంచెకట్టు తె లుగుదనానికి ప్రతీకగా ఉంటుందని, అదేవిధంగా చంద్రబాబుకూడా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమైన పంచెకట్టుతోనే వెళితే సహజత్వంగా ఉంటుందని చెబుతున్నారు. రైతు వినియోగించే కండువా కూడా నిరంతరం వాడాలం టున్నారు. ‘రైతంటే పంచెకట్టాలని రూలేమీ లేదు. ప్యాంటు కూడా వేసుకోవచ్చు. విదేశాల్లో రైతు ప్యాంటే వేసుకుని వ్యవసాయం చేస్తారు. కాకపోతే మన రైతు ఆహార్యం చాలా హుందాగా, పెద్దరికంగా, ఆత్మీయంగా, విశ్వాసానికి, తెలుగుదనానికి ప్రతీకగా ఉంటుంది. బాబు పంచె, కండువాతో వెళితే రైతునేతగా గుర్తుండిపోతారు.

చరణ్‌సింగ్‌, చౌతాలా వంటి నేతలంతా పంచెతోనే రైతునాయకులిగా గుర్తుండిపోయార’ని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే, చిత్తూరు జిల్లా రైతులు ధరించే తమిళుల తరహాలో అడ్డ లుంగీ కాకుండా, పంచె కడితేనే బాగుంటుందని చెప్పారు. దీనిపై అటు పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ‘మేం దీనిని బాబు దృష్టికి తీసుకువెళతాం. గతంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. అప్పట్లో బాబు దానిపై సుము ఖత వ్యక్తం చేశారు. మళ్లీ దానిపై ఆయనతో మాట్లా డతాం’ అని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు.

Wednesday, October 26, 2011

బాబు రైతుబాట

babu1
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ రైతు బాట పట్టను న్నారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు నవంబర్‌ 2 నుంచి ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేయను న్నారు. ప్రతిరోజు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యక్రమం రూపొంది స్తున్నారు. సీనియర్‌ నేత కోడెల ఆధ్వర్యంలో పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామాల్లోని రైతులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను బాబు తెలుసుకుంటారు. స్థానికంగా ఉండే మార్కెట్‌ యార్డులను కూడా పరిశీలించనున్నారు. వాటిపై ఆయన రైతుల సమక్షంలోనే ఆయా జిల్లా కలెక్టర్లకు ఫోన్లు చేసి, వాకబు చేయనున్నారు.

నవంబర్‌ 2 నుంచి అనంతపురం నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు ‘రైతు రాజ్యం కోసం’ లేదా ‘రైతుపోరుబాట’ గానీ పేరు ఖరారు చేయనున్నారు. చివరకు ‘రైతు రాజ్యం కోసం’ పేరును ఖరారు చేయవచ్చంటున్నారు. ఈ మేరకు రాష్టవ్య్రాప్తంగా బాబు పాదయాత్ర కార్యక్రమాన్ని రైతు కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పార్టీ నేతలతో కలసి రూపొందించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లా పాదయాత్ర అనంతరం రెండురోజుల గడువు తర్వాత ప్రకాశం, గుంటూరు, కృష్ణా.. ఆ తర్వాత మొత్తం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు.

గతంలో ‘రైతుకోసం’ ఆమరణ నిరాహారదీక్షతో రైతుల మనసు గెలిచిన బాబు.. ఈసారి ఏకబిగిన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సన్నాహాలు చేస్తుండటం చర్చనీయాంశమయింది. ఇటీవలి కాలంలో రాష్టవ్య్రాప్తంగా పాదయాత్రలు చేసిన నాయకులు లేకపోవడం గమనార్హం. తనపై గతంలో వైఎస్‌ వ్యూహబృందం వేసిన రైతు వ్యతిరేకి ముద్రను ఆమరణ నిరాహారదీక్షతో తొలగించుకున్న బాబు.. ఈసారి పూర్తి స్థాయిలో రైతునేత ముద్ర కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తమను ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్న రైతాంగానికి బాసటగా నిలవడం ద్వారా.. ఎన్టీఆర్‌ హయాంలో ఉన్న ‘రైతుపార్టీ’ ముద్రను పునరుద్ధరించాలన్నది బాబు ధ్యేయంగా కనిపిస్తోంది. అదే సమయంలో జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహపరచడమే కాకుండా, జిల్లాల్లో నెలకొన్న పార్టీ తగాదాలను పరిష్కరించి, వారిని ఒక్కతాటిపై నడిపించేందుకు ఈ పాదయాత్ర అక్కరకొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాబు యాత్రలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలు ఉండేలా చూస్తున్నారు.

Friday, September 18, 2009

పెదబాబు - చినబాబు

తెలుగు రైతుకు ఇవాళ దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటాడు? మా చంద్రబాబు చల్లగుండేట్టు చూడు; నాలుగు కాలాలపాటు ఆ బాబును ఉన్నచోటే ఉంచు - అంటాడు. చల్లగా ఎందుకుండాలంటే... రైతన్నకు ఇప్పుడు నాయుడుగారే పెద్ద అండ కనుక! ఉన్న చోటే ఎందుకు ఉంచాలంటే - చోటు మారితే ఆయన ప్లేటు మార్చేయవచ్చు కనుక!
అధికారం అందిన బాబు, అధికారం అందని బాబు అని చంద్రబాబులు రెండు రకాలు. గద్దెమీది బాబుకు వ్యవసాయం శుద్ధదండుగ; ఒక పనికిమాలిన వ్యాపకం అనిపిస్తుంది. పొలం పనులు మానేసి కంప్యూటర్లు నేర్చుకోమని రైతుబిడ్డలకు ఉచిత సలహా ఇవ్వబుద్ధేస్తుంది. రైతులకు కరంటు ఉచితంగా ఇస్తే కరంటు తీగలు బట్టలు ఆరేసుకోవటానికి మాత్రమే పనికొస్తాయని బుద్ధి తక్కువ జనానికి ఉపదేశించాలనిపిస్తుంది. పొలం పండక, ఇల్లు గడవక, అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుపేద రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే, దాని ఆశకు ఇంకా చాలామంది ప్రాణాలు తీసుకుంటారు అని అల్లాడే జనానికి క్లాసులు పీకాలనిపిస్తుంది.
అదే - గద్దెకింది బాబుకు గుండె కొట్టుకునేది రైతుకోసమే. ఎల్లవేళలా ఆయన కోరుకునేది రైతు క్షేమమే. పవరు పోయాక ఆయనకి అర్జంటుగాప్రియాతి ప్రియమయ్యేది వ్యవసాయం. దానికోసం సర్కారు ఎంత చేసినా చాలదు; ఇంకా ఎంతో చెయ్యాలనే ఆయనకి అడగాలనిపిస్తుంది. నడమంత్రంగా తనకు గుర్తుకొచ్చిన కర్షకుడి కోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది. అదిగో ఆ ఆవేశంతోటే, ఆ త్యాగశీలంతోటే మొన్న రైతులకోసం పట్టుబట్టి, కష్టపడి అరెస్టు అయ్యాడు. పోలీసువాళ్లు పొమ్మన్నా ఇంటికి పోకుండా రాత్రంతా గోషామహల్ పోలీసుస్టేషనులో చలిలో ముడుచుకు పడుకున్నాడు. అవసరం ఉన్నా లేకున్నా రైతులకోసం ఆత్మార్పణకు సిద్ధమైతే ఒక పని అయిపోతుందన్న ఆరాటంతో ఆ మహానుభావుడు రాష్ట్ర చరిత్రలో ఏ మాజీ ముఖ్యమంత్రి చెయ్యని అద్భుత కార్యాన్ని ఇప్పుడు తలపెట్టాడు. మిత్ర మీడియా దుందుభులు దిక్కులదరగొడుతుండగా... కులశ్రేష్ఠులు, రాజగురువులు నీరాజనాలిస్తుండగా... ఏకంగా ఆమరణ నిరాహారదీక్షనే లోకోత్తరంగా మొదలెట్టాడు.
పాత్రకు తగ్గట్టు వేషం వేయటం, పాత్రోచితంగా మాట్లాడటం నాటకాల్లోనే కాదు; రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ అవసరం. ప్రస్తుతం తాను ధరించిన ప్రతిపక్ష నాయక పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసి బాబుగారు ఆస్కార్ లెవెల్లో రక్తికట్టిస్తుంటే మెచ్చుకోవలసింది పోయి కొంతమంది ‘దేశ’ద్రోహులు ఎకసెక్కాలాడటం దుర్మార్గం. సింహాసనం మీద ఉన్నప్పుడు బాబుగారు విద్యుత్ చార్జిలు పెంచితే పెంచి ఉండవచ్చు. పెంచిన చార్జిలు తగ్గించమని ఆందోళన చేస్తే బషీర్‌బాగ్ సెంటర్లో కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకునీ ఉండవచ్చు. అయితే ఏమిటట? ఇప్పుడే అదే బషీర్‌బాగు సెంటరుకు కేవలం కొన్ని వందల గజాల దూరంలో రైతులకోసం ఆ మహానుభావుడు ఆమరణ నిరాహార దీక్షకు కూచుంటే కళ్లారా చూసి, నోరారా పొగిడి తరించాలి గాని, దిక్కుమాలిన ఫ్లాష్‌బ్యాకులను గుర్తు చెయ్యడమెందుకు? ప్రపంచ బ్యాంకు హెడ్మాస్టరు బెత్తానికి భయపడి, చెప్పినట్టల్లా నడచుకున్న పాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన అన్న వాటిని, చేసిన వాటిని పట్టుకుని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పాత్రలో ఆయన తలపెట్టిన రైతు లోక కల్యాణాన్ని యద్దేవా చేయటం ఏమైనా బాగుందా? తన చల్లని పాలనలో ఏడేళ్లు కరువు కాటకాల్లో నలిగి రైతులు విలవిలలాడినంతకాలమూ చిటికెనవేలును కదపకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటేనేమి... తనకు గిట్టని పాలనలో ఈ ఏడు ఒక మోస్తరు భారీ వర్షం దెబ్బకే బొబ్బలు పెట్టి కర్షకుల పేరిట ఆ మహనీయుడు దివ్యమైన దీక్షకు దిగాడు - చాలదా? రైతులకు ఎరువులు, విత్తనాల అవసరాలుంటాయని పవర్లో ఉన్నప్పుడు తమరికి ఎందుకు గుర్తుకురాలేదని ఆయనంతటి మహా పురుషుడిని పట్టుకుని అడిగెయ్యటం భావ్యమా? ఆ పుణ్యాత్ముడి పరిపాలనలో అసలు వర్షాలే పడనప్పుడు, ఎరువులతో, విత్తనాలతో ఏమిటి అవసరం?
ప్రతి పుణ్యకార్యానికీ ఒక ప్రేరణ అనేది ఉంటుంది. చినబాబు 48 గంటల దీక్ష బెజవాడలో చేస్తాననేసరికి అతడికంటే ముందే, అంతకంటే పెద్ద హైదరాబాద్‌లో తాను ఏకంగా ఆమరణదీక్ష మొదలెట్టేసి క్రెడిట్ కొట్టెయ్యాలన్న మంచిబుద్ధి పెదబాబుకు కలిగింది. తప్పా? ఉద్యోగం వేటలో ఉన్న కుర్రాడిలా బిడియపడుతూ సిగ్గులొలికే జగనబ్బాయకే అంత సీను ఉన్నప్పుడు... ఆటుపోట్ల ధీరుడు, వెన్నుపోట్ల వీరుడు, బిల్‌క్లింటన్ మిత్రుడు, తొమ్మిదేళ్లు చక్రం తిప్పిన ఘనుడు అయన బాబయ్యగారు ఆ చిరంజీవిని అనుగ్రహించి అతడి ఐడియాను కొంచెం కొట్టేసి, ఇంకొంచెం సానపడితే తప్పొచ్చిందా? తన శిష్యుడులాంటి కెసిఆరే ఆమరణ దీక్షకు కూచుని, అంత పబ్లిసిటీ కొట్టేసి, అంతంత పేరు మోగించుకున్నప్పుడు తానూ అదే విన్యాసాన్ని అతడికంటే గొప్పగా లాగించి, శిష్యుడిని మించిన గురువు అనిపించుకోవాలని ఆయన ఆశపడటం పేరాశ ఎలా అవుతుంది?
కాదు గాక కాదు. గొప్పవాళ్ల లీలల్లో తప్పులు వెతకటం శుద్ధ తప్పు. ప్రతి రైతు లోగిలిలో పాడి ఉంటుంది. అదే పాడితో బాబు ఫామిలీ పెద్ద పరిశ్రమే పెట్టింది. కాబట్టి రైతుకూ బాబుకూ మధ్య విడదీయలేని అనుబంధం ఎప్పటినుంచో ఉంది. ఆ సంగతి మనం చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలాగే ఇడుపులపాయ ఎస్టేటులో అడపాదడపా గట్లవెంట, చెట్లవెంట తిరిగిన అద్భుత అనుభవం చి.జగన్‌కి పుష్కలంగా ఉంది. ఆ సమయాల్లో అతడి చొక్కాకో, లాగూకో ఎంతోకొంత మట్టి అంటుకునే ఉండాలి. పైగా ఈ మధ్య పార్టీ పెట్టబట్టాక రైతు పరామర్శకు పొలాలకెళ్లి సాక్షి టీవీ సాక్షిగా వరి కంకులు పట్టి, బురద అంటించుకున్న విశేషానుభవమూ ఆ అబ్బాయకి ఉంది. అలాంటప్పుడు అతడికి రైతుల బాధలు తెలియవని, మట్టివాసన ఎరుగడని ఎవడూ అనలేడు. ‘లాటానుప్రాసం, ఛేకానుప్రాసం భూటానులో ప్రారంభించాయ గలాటాను’ అని అప్పుడెప్పుడో మహాకవి అన్నట్టు హైటెక్‌ల పెదబాబు, ఇండస్ట్రీల చినబాబు రైతన్నల పేరు మీద మారథాన్ దీక్షలకు పోటీలుపడి దిగటమే మనకు కన్నులపండువ. కాణీ ఖర్చులేని మహావినోదం కూడా.
-సాక్షి